మూడు ఓవర్లో ఖేల్ ఖతం

ఇంగ్లండ్‌తో నాటింగ్‌హామ్ లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ కేవలం 2.5 ఓవర్లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేసింది. 11 పరుగులు చేసిన ఆండర్సన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది కోహ్లి సేన.

రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో పేసర్ల విజృంభణకు ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లోనే 62 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బట్లర్‌, స్టోక్స్‌ అద్భుత ఆటతీరును కనబరుస్తూ సెంచరీ భాగస్వామ్యంతో భారత బౌలర్లను విసిగించారు. బట్లర్‌ (106) శతకం, స్టోక్స్‌ (62) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడడం వలన నాలుగు రోజుల్లో ముగియవలసిన ఆట ఐదో రోజు కూడా కొనసాగించవలసి వచ్చింది. బూమ్రాకు 5వికెట్లు, ఇషాంత్ శర్మకు 2, అశ్విన్‌కు 1, మహ్మద్ షమీకి 1, హార్థిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లికి ద‌క్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకొన్నవిరాట్ కోహ్లి ట్రెంట్ బ్రిడ్జ్ విజయన్నీ మొత్తం జట్టు తరఫున కేరళ వరద బాధితులకు అంకితం ఇస్తున్నాం అని చెప్పాడు. సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది.