షిండే అలా అనలేదు : గాదె వెంకట రెడ్డి

gade venkata reddyమాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అందరూ చెబుతున్నట్లుగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే కాంగ్రెస్ రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నట్లు తెలంగాణపై అఖిలపక్షంలో చెప్పలేదని, అలా ఆయనన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ విసిరారు. కొందరు పనిగట్టుకుని అఖిలపక్షంలో జరిగిన అంశాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న నమ్మకం తనకుందని, అదే విషయాన్ని తాను సమావేశంలో గట్టిగా వినిపించానని చెప్పారు. పార్టీ అభిప్రాయం చెప్పాలని అధిష్టానం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని ఆయన సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో స్పష్టంచేశారు. సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎవరి అభిప్రాయం వారు చెప్పుకోవాలని మాత్రమే ఆదేశించిందని వివరించారు. సురేష్‌రెడ్డి రెండు రాష్ట్రాలు తమ విధానమనగా తాను తీవ్రంగా వ్యతిరేకించానని, అది ఆయన వ్యక్తిగతమే తప్ప తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశానని తెలిపారు. సురేష్‌రెడ్డి అభిప్రాయంగానే షిండే కూడా రెండు రాష్ట్రాలని చెప్పారే తప్ప కాంగ్రెస్ అభిప్రాయం అనలేదన్నారు. తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్రలో, సమైక్యంగా ఉంటే తెలంగాణలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదని, ఏనాటికీ సాధ్యం కాదన్నారు.