ఏపీ రాజకీయాలు కొత్త రంగు పులుముకుంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి గట్టి పోటీ ఇస్తామని ధీమాగా ఉన్న వైకాపాకు షాక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ జిల్లా స్థాయిలో నాయకులను ఏర్పాటు చేసే విషయమై ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
రాజకీయ విశ్లేషకులు వచ్చే ఎన్నికల్లో వీరిద్దరి కలయిక వల్ల ఎవరికి ఉపయోగం అనే విషయంలో చర్చలు జరుపుతుంటే కొందరు ఔత్సాహికులు మరియు సాదారణ ప్రజలు మాత్రం వీరిద్దరి కలయిక శుభపరిణామంగా చెబుతున్నారు. వీరిద్దరు కలిసి పని చేస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టార్డం మరియు జేపీ మేదస్సు కలిపి రాజకీయాలు చేస్తే అద్బుత ఫలితాలు వస్తాయనే నమ్మకంను సాదారణ యువత కూడా వ్యక్తం చేస్తుంది. మొత్తానికి వీరిద్దరి కలయిక శుభపరిణామంగా పొలిటికల్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.