నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంపై కనీసం ప్రత్యేక శ్రద్ద చూపించకుండా మోడీ ప్రభుత్వం చూపించిన వివక్షకు టీపీడీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కేటాయించిన విధంగానే ఏపీకి కూడా కేటాయిస్తాం అంటూ కేంద్రం చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని, రాజధాని నిర్మాణంకు, కొత్త రాష్ట్రం అభివృద్దికి ఇవ్వాల్సిన కనీస నిధులు కూడా కేటాయించలేదు అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బడ్జెట్‌పై స్పందించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంకా మాట్లాడుతూ… కొత్త రాజధాని కోసం మరియు లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం కోసం కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కాని అన్ని రాష్ట్రాల మాదిరిగానే అంటూ చెప్పడంతో తీవ్ర నిరాశ కలిగిందని, రాష్ట్రానికి నిధులు తీసుకు వచ్చేందుకు పలు సార్లు మంత్రులతో భేటీ అయ్యాము అని, అయినా కూడా బడ్జెట్‌లో ఏపీకి ప్రాతినిధ్యం దక్కలేదు అంటూ రామ్మోన్‌నాయుడు అన్నాడు. రాష్ట్రం కోసం రాజీనామా చేసేందుకు కూడా సిద్దం అని, కేంద్రం ఇప్పటికైనా ఏపీకి నిధులు కేటాయించాలని, ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే అంటూ రామ్మోహన్ డిమాండ్ చేశాడు. ఇంకా పలువురు టీడీపీ ఎంపీలు కూడా బడ్జెట్ కేటాయింపులపై ఆగ్రహంను వ్యక్తం చేశారు.