పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ బలోపేతంకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణలో యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ ఆ తర్వాత అక్కడ నుండి కరీంనగర్ జిల్లా కేంద్రంకు చేరుకున్నాడు. అక్కడ స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలతో మాట్లాడటం జరిగింది. రాత్రి వరకు పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ కరీంనగర్ బస్‌స్టాండ్ పక్కన ఉన్న హోటల్ శ్వేతలో బస చేయడం జరిగింది.
ఆ హోటల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయిన జీవన్ రెడ్డికి చెందినది అంటూ స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలో పవన్ యాత్రకు టీఆర్‌ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉందని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శణం అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజుల ముందు పవన్ స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను కలవడం, ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే జనసేన పార్టీకి తెలంగాణలో టీఆర్‌ఎస్ సపోర్ట్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్‌ను స్వయంగా ఆ ఎమ్మెల్యే తమ హోటల్‌లో బస చేయమని కోరినట్లుగా కూడా కొందరు చెబుతున్నారు. అయితే జనసేన పార్టీ నాయకులు మాత్రం ఇది కాకతాళియంగా జరిగింది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.