పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు నేడు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుండి యాత్రను ప్రారంభించిన విషయం తెల్సిందే. ప్రజా యాత్రలో భాగంగా కరీంనగర్లో పవన్ కళ్యాణ్ మీడియాను మరియు ఫ్యాన్స్, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆ సందర్బంగా పవన్ పలు విషయాలపై స్పందించాడు. అందులో ఒకటి జనసేన పార్టీకి చిరంజీవికి సంబందం లేదు అంటూ బల్లా గుద్దినట్లుగా చెప్పుకొచ్చాడు.
గతంలో అన్న చిరంజీవి ప్రజారాజ్యంను వెనుకుండి నాశనం చేసిన ప్రతి ఒక్కరిపై పగ సాదిస్తాను అంటూ చెప్పుకొచ్చిన పవన్ ఇప్పుడు మాత్రం ప్రజారాజ్యంకు మరియు చిరంజీవికు జనసేనతో ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. జనసేన పార్టీ కూడా ప్రజారాజ్యం మాదిరిగా అయిపోతుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అందుకే చిరంజీవికి ఈ పార్టీతో సంబంధం లేదని, ప్రజారాజ్యంకు ఈ పార్టీకి పోలిక లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల్లో చిరంజీవి మరియు ప్రజారాజ్యం పేరును తొలగించేందుకు పవన్ అండ్ టీం చాలానే కష్టపడుతున్నారు. మరి 2019 ఎన్నికల్లో చిరంజీవి ప్రభావం ఏమైనా కనిపిస్తుందా అనేది చూడాలి.