తెలుగు దేశం పార్టీకి బీజేపీకి మద్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం మరియు బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశం లేదు అంటూ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే వైకాపా అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశాడు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి కండీషన్స్ పెట్టకుండా తాము ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తామని, ఆ పార్టీ అన్నమాట తప్పడంతో పాటు, ఇప్పుడు కూడా ఇంకా నాన్చుడు దోరణితో వ్యవహరిస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గత కొన్నాళ్లుగా బీజేపీకి టీడీపీ దూరంగా నడుస్తున్న సమయంలో జగన్ చేసిన ఈ ప్రకటన వైకాపా, బీజేపీల మద్య పొత్తుకు తెర లేపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 2019 ఎన్నికల్లో కొత్త పొత్తు పొడిచే అవకాశం క్లీయర్‌గా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ ప్రత్యేక హోదా ఇస్తే పొత్తు అంటున్నాడు. ఆ విషయంలో కాస్త నాన్చేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి వైకాపా కాని టీడీపీ కాని పొత్తు అవసరం లేదు. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైకాపాతో పొత్తు పెట్టుకోవడం మంచిదంటూ ఏపీ బీజేపీ నాయకులు అధిష్టానం వద్ద చెప్పుకొస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.