పవన్‌ కూడా కులాన్ని ఉపయోగించుకోనున్నాడా?

ప్రస్తుత రాజకీయాలు కులాలను ఉపయోగించుకుని సాగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కులాలతో ఓట్లు అడిగేందుకు నాయకులు ఏమాత్రం సిగ్గు పడటం లేదు. అందుకే ప్రతి నాయకుడు కూడా అన్ని కులాల నాయకులను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు తమ పార్టీలో ఉంటే బలంగా ఉంటుందని భావిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. అందరితో పాటే తాను అన్నట్లుగా పవన్‌ కూడా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

పార్టీ పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించింది లేదు. 2019 ఎన్నికల కోసం పవన్‌ జనసేన నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకోసం తెలంగాణ నుండి ప్రజా యాత్రను నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో త్వరలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలువబోతున్నాడు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేసిన ముద్రగడతో త్వరలో పవన్‌ భేటీ అవ్వనున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

గత కొంత కాలంగా ముద్రగడకు ఏపీలో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా కాపుల్లో ముద్రగడ హీరో అయ్యాడు. ఆ కారణంగా పవన్‌ ఆయన్ను కలిసి పార్టీలో చేరమని అడిగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అంటే పవన్‌ తన పార్టీలో కాపులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాపు ఉద్యమ నాయకుడిని చేర్చుకోవడం వల్ల పవన్‌ కూడా కులాన్ని ఉపయోగించుకోబోతున్నట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు. పవన్‌ అలాంటి రాజకీయం చేయడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పవన్‌ అడుగులు ఎలా పడతాయో చూడాలి.