పవన్‌ తెలంగాణలో ఎవరిని ప్రశ్నిస్తాడు

పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ నుండి రాజకీయ యాత్రను ప్రారంభించబోతున్నాడు. ఇటీవలే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తాను పర్యటన చేయబోతున్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాడు. నేడు కొండగట్టుకు వెళ్లి పవన్‌ కళ్యాణ్‌ అక్కడ నుండి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో పవన్‌ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు అయ్యింది. తెలంగాణలో పవన్‌ పర్యటనపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన్ను ఆకాశానికి ఎత్తేసిన పవన్‌ ఏ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు అంటూ కాంగ్రెస్‌ నాయకులు అడుగుతున్నారు.

కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో జరుగుతున్న విద్యుత్‌ అవినీతి గురించి తెలుసుకోవాలని, ఆయన పలు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వంకు అనుకూలంగా ఉండటం వల్ల ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఏం ప్రశ్నిస్తాడు అంటూ ఎద్దేవ చేశాడు. పవన్‌ కళ్యాణ్‌ను తెలంగాణలో తిరుగనివ్వం అంటూ ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌కు తెలంగాణలో తెరిగే అర్హత లేదు, తెలంగాణలో ఆయన్ను తిరుగనివ్వం అంటూ హెచ్చరించాడు. కాంగ్రెస్‌ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో పవన్‌ పర్యటన ఎలా సాగుతుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.