సినిమా నటుడు మోహన్‌బాబుకు మూడు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు, సినీ నిర్మాత అయిన టి సుబ్బిరామిరెడ్డి కాకతీయ కళావైభవం ఆధ్వర్యంలో సన్మానించి బిరుదును ప్రధానం చేసిన విషయం తెల్సిందే. ఆ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.
తెలంగాణలో కళను ప్రోత్సహించేందుకు తాను ఈ కార్యక్రమంను చేపట్టినట్లుగా టీఎస్సార్ చెప్పుకొచ్చాడు. ఇక టీఎస్సార్ చేసిన పనిని తెలంగాణ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తప్పుబట్టింది. కాకతీయ కళా వైభవం పేరుతో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సినిమా సంస్కృతిని కాకతీయ కళావైభవం అంటూ ముడి పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఇప్పటికే సినిమా పరిశ్రమ వల్ల తెలంగాణ సంస్కృతికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయన మళ్లీ ఇప్పుడు కాకతీయ వైభవం పేరుతో మరింతగా చెడగొట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
కాకతీయ కళావైభవం పేరుతో తెలంగాణలోని కళలను ప్రోత్సహిస్తే పర్వాలేదు కాని సినిమా కార్యక్రమాలు చేస్తే మాత్రం ఊరుకోము అంటూ పాపారావు తీవ్ర స్వరంతో టీఎస్సార్‌ను హెచ్చరించడం జరిగింది. ఈ విషయమై టీఎస్సార్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.