తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టెన్షన్‌లో చంద్రుల్లు

ఉత్తరాధిన బీజేపీ జెండా రెపరెపలాడిస్తూ వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతి ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే సౌత్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో బీజేపీకి అవకాశాలు, అదృష్టం కలిసి రావడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఛాన్స్‌ లేదని ఇప్పటికే తేలిపోయింది. అలాగని అధికారంలో ఉన్న పార్టీలు కూడా సునాయాసంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు అనుకుంటే పొరపాటే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంను దక్కించుకోవాలి అంటే అంత సులభమైన విషయం కాదని, కాకుంటే చంద్రబాబు నాయుడుకు మరో అవకాశం ప్రజలు ఇవ్వొచ్చు అంటూ కొన్ని నెలల క్రితం వరకు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. కాని మారుతున్న రాజకీయ పరిణామాలు మరియు ప్రతిపక్ష నేత జగన్‌ చేస్తున్న పాదయాత్ర కారణంగా, పవన్‌ జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కారణంగా చంద్రబాబు నాయుడు బలం తగ్గిపోతుంది.

గతంతో పోల్చితే ఇప్పుడు బాబు మళ్లీ సీఎం అవ్వాలంటే ఎక్కువ కష్టపడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్ట్‌లు మరియు పథకాల కారణంగా చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి గుబులు మొదలవుతుంది. కొన్ని నెలల ముందు వరకు టీఆర్‌ఎస్‌ కళ్లు మూసుకుని 2019 ఎన్నికల్లో గెలిచేస్తుందని అంతా భావించారు. అయితే యువతలో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్‌కు బలం చేకూరడం, కాంగ్రెస్‌లో కొత్త రక్తం చేరడం మరో వైపు ప్రభుత్వంకు వ్యతిరేకంగా కోదండరాం సారు చేస్తున్న ఉద్యమాలు.

ఇలా రకరకాలుగా టీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో దెబ్బ పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా పట్టు సడలేదు అని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు మరో సంవత్సరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం కేసీఆర్‌ అద్బుతాలు సృష్టిస్తాడని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్రాల్లో 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరిలో చంద్రబాబు నాయుడుకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, కేసీఆర్‌ కూడా అనుకున్న రేంజ్‌లో స్థానాలు దక్కించుకోక పోవచ్చు అంటూ సర్వేలు కూడా చెబుతున్నాయి.