22న వస్తున్న ‘యముడికి మొగుడు’

yamudiki-mogudu‘అల్లరి నరేష్’ నూతన తార రిచాపనయ్ జంటగా సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ‘యముడికి మొగుడు’ చిత్రం నిర్మాణానాంతర పనులు పూర్తికావచ్చాయి. ఇందులో భాగంగా గ్రాఫిక్స్ పనులు తుది దశకు చేరుకున్నాయని, 74 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. తొలికాపీ సిద్ధమైన వెంటనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిగావించి, ఈ నెల 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు విశేషమైన స్పందన లభించిందని అన్నారు. కోటి సంగీత సారధ్యంలో రూపొందిన ఏ పాటకు ఆ పాట ఓ హైలైట్ అని చెప్పారు. అల్లరి నరేష్ తనదైన వినోదాత్మక నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తారని అన్నారు. తమ సంస్థ నిర్మిస్తున్న తొమ్మిదవ చిత్రమిదని, ఐదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ సినిమా తీస్తుండటంతో ఓ విభిన్న కథాంశాన్ని ఎన్నుకుని, భారీస్థాయిలో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. సోషియో ఫాంటసీకి చక్కటి వినోదాన్ని మేళవించి, అన్నివర్గాలను ఆకట్టుకునే రీతిలో సత్తిబాబు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారని అన్నారు. కాగా యముడి చిత్రాలలో భిన్నంగా ఇంతవరకు రాని యుముడి కుటుంబాన్ని ఇందులో చూపిస్తున్నామని దర్శకుడు సత్తిబాబు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో షియాజీషిండే యుముడిగా, అతని భార్యగా రమ్యకృష్ణ, చిన్న యమునిగా భరత్, చిత్రగుప్తునిగా కృష్ణభగవాన్ తదితరులు తారాగణం.