అమ్మాయిలకు నో జీన్స్

ఉత్తరప్రదేశ్, హర్యానా, రాష్ట్రాల్లో కాలేజి అమ్మాయిలు జీన్స్ వేసుకోరాదంటూ ఆంక్షలు విధించడంపై విద్యార్థునులతో పాటు మహిళా సంఘాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి.  డ్రెస్ కోడ్ ను ఉల్లంఘిస్తే ౧౦౦ రూపాయలు ఫైన్ విధిస్తామని కాలేజి యజమాన్యలు హెచ్చరించాయి. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆదేశాలు జారీచేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. హర్యానాలోని భివానీలో గల కళశాలలో జీన్స్ ధరించవద్దని ఆంక్షలు పెట్టారు. ఆదర్శ్ మహిళా కళాశాల విద్యార్థినులకు ఆ విధమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ “కన్యా విద్యాదాన్ యోజన” కింద సీఎం నుంచి ఆర్థిక సహాయం చెక్కులను అందుకున్న విద్యార్థినులు టాప్స్ తో కూడిన జీన్స్ ను గానీ, బ్లాక్ డ్రెస్ లు గానీ ధరించకూడదని, సాధారణ సంప్రదాయక దుస్తులనే ధరించాలని బిజనూర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజి అమ్మాయిలు, మహిళా సంఘాలు ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ లక్నోలో ప్రదర్శన నిర్వహించారు. ఇది తమ స్వేచ్చా జీవితాన్ని కట్టడి చేయడమేనని వారు తెలిపారు.