‘రామయ్యా వస్తావయ్యా’ గా హిందీలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’

సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని ఎప్పటినుండో పరీక్షించుకుంటూ వస్తున్న శృతిహాసన్ కెరీర్ ‘గబ్బర్‌సింగ్’ అందించిన అనూహ్యమైన విజయంతో ఒక్కసారిగా స్పీడందుకుంది. ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో ‘ఎవడు’, రవితేజతో ‘బలుపు’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ చిత్రాలతో పాటు తెలుగులో విజయవంతమైన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రానికి రీమేక్‌గా ప్రముఖ కొరియోగ్రాఫర్‌, హీరో, బాలీవుడ్‌ లో పాపులర్‌ రీమేక్‌ దర్శకుడిగా పేరొందిన మన ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రంలో శృతి నటిస్తోంది. ‘రామయ్యా వస్తావయ్యా..అంటూ సాగే పాపులర్ గీతంలోని పల్లవిని ఈ చిత్రానికి టైటిల్‌గా ఖరారు చేశారని ముంబై చిత్ర వర్గాల సమాచారం. అన్నట్టు మాతృక “నువ్వొస్తానంటే….” కు కూడా దర్శకత్వం వహించింది ప్రభుదేవాయే!

టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పతాకంపై కుమార్ తౌరానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్‌కు అన్నగా సోనూసూద్ తెలుగు వెర్షన్‌ లో శ్రీహరి పోషించిన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా గిరీష్‌కుమార్ పరిచయమవుతున్నాడు. చీత్రీకరణ ముంబైలో ఆగస్ట్ 1న లాంఛనంగా ప్రారంభమైంది. అక్కడ ఒక పాటని చిత్రీకరించారు. ఆ తర్వాత తాజా షెడ్యూల్ కోసం హిమాచల్ ప్రదేశ్ చేరుకుంది చిత్ర యూనిట్. శృతిహాసన్ హిందీలో చాలా కాలం తర్వాత చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకుందని తెలుస్తోంది. మరి ప్రభుదేవా ఎంత వరకు ఆమె నమ్మకాన్ని నిజం చేస్తాడో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ 7 వరకు వేచి చూడాల్సిందే.