దేశం దాటి ఎగరనున్న రాజమౌళి “ఈగ”

పెద్ద పెద్ద హీరోల సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడుతున్న దశలో హీరో లేకుండా ఓ సినిమా తీసి ఎవ్వరూ ఊహించనంత పెద్ద కమర్షియల్‌ హిట్‌ సాధించాడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆ చిత్రమే “ఈగ”. నిఖ్ఖచ్చిగా చెప్పాలంటే ఈ సినిమాకు హీరో ఈగే. సాంకేతిక పరిజ్ణానాన్ని అత్యద్భుతంగా ఉపయోగించుకుని సినీ ప్రేక్షకులకు నయనానందకరమైన విందుగా మలచిన చిత్రం “ఈగ”. ఈ చిత్రం తమిళం, హిందీ భాషల్లోకి కూడా అనువదించబడి వసూళ్ళపరంగా మంచి సక్సెస్‌ ను సాధించగలిగింది. ఇప్పుడు తాజాగా మన తెలుగు ఈగ “థాయ్‌” రంగులు పులుముకోనుందట. థాయిలాండు దేశస్థులకు కూడా భారతీయుల లాగే పునర్జన్మలపై నమ్మకాలు ఎక్కువేనట. అందుకే ఆ అంశమే మూలకథా వస్తువుగా తెరకెక్కిన ఈగ చిత్రం అక్కడివారిని కూడా అలరిస్తుందనే నమ్మకంతో ఈగ సినిమాను థాయి భాషలోకి అనువదించాలనుకుంటున్నారట నిర్మాతలు. అంటే త్వరలో మన ఈగ విదేశీ గడ్డపై కూడా ఎగరబోతుందన్నమాట! థాయ్‌ లాండ్‌ లో కూడా ఈగ హిట్‌ అయిపోతే, వరుసగా రాజమౌళి సినిమాలన్నీ థాయి భాషలోకి అనువదించబడి రిలీజయిపోయినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఆల్‌ ది బెస్ట్‌ రాజమౌళి గారూ!