సత్తెనపల్లిలో నలుగురు అక్క చెల్లెల్లు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో తల్లిదండ్రులు చనిపోవడంతో వారు అనాధలయ్యారు. పెద్ద అమ్మాయి వివాహం అవ్వగా ముగ్గురు అమ్మాయిలు వివాహం కాకుండా ఉన్నారు. ముగ్గురిలో ఇద్దరు హోం ట్యూషన్స్ చెబుతుండగా, చిన్న అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఇటీవల ఇద్దరు అక్కలు కూడా చిన్న అమ్మాయిని త్వరగా డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం చేయాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. కాని ఆమె మాత్రం డిగ్రిలో ఫెయిల్ అయ్యింది. చదువుపై శ్రద్ద పెట్టడం లేదంటూ ఇద్దరు అక్కలు కూడా ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అక్కలు తిట్టారనే కోపంతో చిన్నమ్మాయి ఇల్లు విడిచి వెళ్లి పోయింది. ఎటు పోతుంది, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తుందని అక్కలు భావించారు. కాని వారం రోజులు గడిచిన చెల్లి ఆచూకి లభించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెదికి వెదికి వేసారి పోయారు. తమ చెల్లి ఏమైందో అంటూ ముగ్గురు అక్కలు ఆందోళన చెందుతున్న సమయంలో ఒక రోజు చెల్లి నుండి ఫోన్ వచ్చింది. తాను చాలా సంతోషంగా ఉన్నాను, తన గురించి ఆందోళన అక్కర్లేదు అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేశారు. ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.
అక్కల కంటే ముందు పెళ్లి చేసుకోవడం సమాజం చులకనగా చూస్తుందనే ఉద్దేశ్యంతో ఇంట్లోంచి బయటకు వచ్చాను అని, తాను చాలా సంతోషంగా భర్తతో ఉన్నాను, తన అత్తా మామ కూడా బాగా చూసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఆ అక్కలు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు క్లోజ్ చేశారు.