మంత్రిని ప్రశ్నించినందుకు 3 వేల జరిమాన

తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం విజయవంతంగా దూసుకు పోతుంది. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. అధికారులను టీడీపీ నాయకులను, మంత్రులను కొన్ని చోట్ల ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని ఆదిశేషయ్య అనే వ్యక్తి మూడున్నర సంవత్సరాల్లో ఏం అభివృద్ది చేశారు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మంచి కాస్త కంగారు పడి తర్వాత తేరుకుని కార్యక్రమంను కొనసాగించాడు.

నెల్లూరు జిల్లా పట్టపుపాళెం గ్రామంలో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా మంత్రి హాజరు అయ్యారు. మంత్రి ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ఆదిశేషయ్య ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. ఇప్పటి వరకు ఏం చేయలేదు, ఇప్పటికి అయినా అర్హులు అయిన వారికి పెన్షన్‌లు ఇవ్వడం, రాజకీయాలతో పెన్షన్‌లు ఇవ్వొద్దని, ఇంకా తమ గ్రామంలో ఉన్న పలు సమస్యలపై ప్రశ్నించాడు.

ఆదిశేషయ్య కారణంగా మంత్రి తన పర్యటనను వెంటనే ముగించుకుని వెళ్లిపోయాడు. దాంతో ఆ గ్రామస్తులు అంతా కూడా ఆదిశేషయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరు పెద్దలు ఆదిశేషయ్యకు మూడు వేల జరిమానా విధించడం జరిగింది. మంత్రిని ప్రశ్నిస్తే జరిమానా ఏంటని ఆదిశేషయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.