తెలుగు దేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ఇప్పటి నుండి పార్టీ నాయకత్వంను, కార్యకర్తలను సిద్దం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఎంతో లేదని, మద్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదంటూ పార్టీ నాయకుల్లో హడావుడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ బంపర్ మెజార్టీతో గెలవాలని చంద్రబాబు నాయుడు ఆకాక్షిస్తున్నారు. తాజాగా పార్టీ నాయకులతో మాట్లాడిన సందర్బంగా అన్ని అసెంబ్లీ స్థానాలను అంటే 175కు 175 అసెంబ్లీ స్థానాలను గెలవాలని పార్టీ నాయకులతో అన్నాడు.
చంద్రబాబు ఏదో పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు 175 సీట్లు గెలవాలి అనగానే బీజేపీ నాయకులు ఉలిక్కి పడుతున్నారు. ఉన్న మొత్తం సీట్లను టీడీపీ గెల్చుకుంటే మరి బీజేపీ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. 2019లో బీజేపీతో అవసరం లేకుండానే టీడీపీ ఎన్నికలకు వెళ్తుందా అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే బాబు అన్న 175 సీట్లు మిత్రపక్షంతో కలిసి గెలుస్తాడా అనేది క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ నాయకులు గత కొంత కాలంగా టీడీపీపై ఏదో ఒక విషయంలో అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. బాబు అన్నట్లుగా 175 అసెంబ్లీ స్థానాలు అసలు సాధ్యమే కాదు. వైకాపా అంత దిగజారి పోలేదు. పార్టీలో స్పిరిట్ నింపేందుకు నాయకులను ఉత్తేజ పర్చేందుకు కొన్ని సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంత మాత్రానికి తెగ ఉలికి పాటు పనికిరాదు అంటున్నారు.