ఏపీ కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ కట్టడాలు అయిన అసెంబ్లీ, హైకోర్టు, సచ్చివాలయం, సీఎం క్యాంపు ఆఫీస్, మంత్రుల భవనాలు, ఎమ్మెల్యే క్వాటర్స్ ఇలా అన్నింటికి సంబంధించిన నమూనాలను సిద్దం చేయిస్తున్నారు. చాలా రోజులుగా పలు నమూనాలను పరిశీలించిన చంద్రబాబు నాయుడు వాటిపై సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. తాజాగా లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ ఇచ్చిన నమూనాలపై సీఎం కాస్త సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
అమరావతిలో ప్రభుత్వ బిల్డింగ్‌ల నిర్మాణంలో తెలుగు దర్శకుడు రాజమౌళి సలహాలు మరియు సూచనలు తీసుకోవాలి అంటూ మొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడుకు కొందరు సలహాలు ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు వారి సలహాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో రాజమౌళి అమరావతి నిర్మాణంలో భాగస్వామి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాని అదంతా ఒట్టి పుకారే అంటూ అప్పుడు రాజమౌళి టీం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు నిజం ఏంటని రాజకీయ నాయకులు మరియు ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.