తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు అయిన టీడీపీ మరియు టీఆర్ఎస్లు నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ సీఎం కేసీఆర్‌లు హస్తినలో సీట్ల పెంపుకోసం తీవ్రంగా కృషి చేశారు. ఇక తాజాగా సీట్ల పెంపు విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. పీఎం నరేంద్ర మోడీ సీట్లను పెంచేందుకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సీట్లను పెంచాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని స్వయంగా ప్రధాని మోడీ తాజాగా కేసీఆర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది.
సీట్ల పెంపు విషయమై కేసీఆర్ మీడియాతో మాట్లాడిన సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ చేసిన పని వల్లే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచే అవకాశం లేకుండా పోయిందని, ఆ మొగాడు చేసిన పనికి ఇప్పుడు అంతా చిక్కుల్లో పడాల్సి వచ్చిందంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని డ్రాఫ్ట్‌ను రాసింది జైరాం రమేష్ అని, ఆ డ్రాఫ్ట్‌లో నాట్ విట్ స్టాండ్ంగ్ 170కి బదులుగా విత్ స్టాండ్ంగ్ 170 అని రాయడం జరిగింది. అందుకే ఇప్పుడు సీట్లను పెంచాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగం మార్చాల్సి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పుట్టను తట్టేందుకు ఆసక్తి చూపడం లేదని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు.