నయనతారకు భారీ పారితోషికానికి ఓకే ఓకే….

ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలకు దాదాపుగా గుడ్‌ బై కొట్టెయ్యాలనుకున్న నయనతార స్పీడు బాగా తగ్గిచడం తెలిసిందే! అయితే ఆ ప్రేమ కాస్తా కొండెక్కడంతో తిరిగి సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంటూ బాగా బిజీ అయిపోయింది నయనతార. తెలుగులో రానాతో కలిసి క్రిష్ దర్శకత్వంలో నటించిన “కృష్ణం వందే జగద్గురుం” నవంబర్‌ నెలాఖరులో రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. నాగ్‌ తో దశరథ్ దర్శకత్వంలో నటిస్తున్న “లవ్‌ స్టోరీ” దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇవి కాకుండా తమిళంలో మరో నాలుగు చిత్రాలు నిర్మాణదశలో ఉన్నాయట. ఇప్పుడు తాజాగా నయన్‌ మరో భారీ ఆఫర్‌ కొట్టేసినట్టు తెలిసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌ సరసన ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి గాను పారితోషికం వీరలెవెల్లో ముట్టిందని వార్తలొస్తున్నాయి. ఉదయనిధి తొలిచిత్రం “ఓకే ఓకే” లోనే నయనతార నటించాల్సిందనీ, అయితే తన డేట్స్‌ అడ్జెస్ట్‌ కాకపోవడంతో ఆ స్థానంలో హన్సిక నటించిందనీ తెలిసింది. ఇప్పుడు తాజాగా ప్రభాకరన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా రెడ్‌ జెయింట్‌ సంస్థ నిర్మించబోతున్న చిత్రంలో భారీ పారితోషికానికి సై అని మరీ నయనను బుక్‌ చేసుకున్నట్లు సమాచారం.