మజ్లిస్ పార్టీ 41 డిమాండ్లు బయటపెట్టండి : వెంకయ్యనాయుడు

venkayya naiduభాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత త్వరగా కూలితే అంత మంచిదని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ అలానే భావిస్తుందని స్పష్టం చేశారు వెంకయ్యనాయుడు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పెంపు, బొగ్గు కుంభకోణం, అధిక ధరలు, కరవు అంశాలపై ప్రభుత్వాన్ని వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు. ఈ అంశాలపై ప్రధానంగా చర్చ జరిపేందుకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం జరిగే ఎన్డీయే పక్షాల సమావేశంలో యూపీఏ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాణంకు మద్దతు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన 41 డిమాండ్లు ఏంటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీయే మజ్లిస్‌ను పెంచి పోషించిందని వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు.