‘కేశవ’పై కోట్లు పెట్టిన శర్వా… ఫలించేనా

యంగ్‌ హీరో శర్వానంద్‌ వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు. సక్సెస్‌లతో దూసుకుపోతూ తన నటనకు మంచి మార్కులు కొట్టేసే శర్వా అమ్మాయిలకు పక్కింటి అబ్బాయిల అనిపించడం ఖాయమే. తాజాగా ‘రాధ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా పర్వాలేదనిపించుకున్నాడు. శర్వానంద్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు ప్లాన్‌ చేస్తూనే డిస్ట్రిబ్యూటర్‌గా బిజినెస్‌ చేస్తున్నాడు. తాజాగా విడుదలయిన ‘కేశవ’ ట్రైలర్‌ చూసి ముగ్దుడయిన శర్వా ఈ చిత్ర ఏపీ హక్కులను సొంతం చేసుకున్నాడు.

విభిన్నమైన కథతో పాటు ఆసక్తికరంగా సాగే టేకింగ్‌ను చూసి ఖుషీ అయిన శర్వానంద్‌ ఏకంగా 4కోట్లను వెచ్చించి ‘కేశవ’ హక్కులను సొంతం చేసుకున్నాడు. నిఖిల్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అందరికి ఆసక్తిగా ఉంది. ఇప్పటికే విభిన్న కంటెంట్‌తో ఆకట్టుకున్న దర్శకుడు సుధీర్‌ వర్మ టేకింగ్‌పై అందరికి అంచనాలు ఉన్నాయి. తాజాగా ట్రైలర్‌ చూడగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకే శర్వా కూడా నమ్మకం పెట్టుకుని ‘కేశవ’పై కోట్లు పెట్టాడు. అయితే శర్వా ఈ ప్రయత్నం ఫలిస్తుందా ఏమో చూడాలి.