మరో పవర్‌ఫుల్‌ పాత్రలో నటించడానికి రానా గ్రీన్‌సిగ్నల్‌

హీరోగా కెరియర్‌ను ప్రారంభించిన రానా అటు హీరోగా, ఇటు కీలక పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ‘ఘాజీ’ చిత్రంలో కూడా ప్రధానమైన పాత్రను పోషించి తన నటనకు గుర్తింపును సొంతం చేసుకుంటున్న రానా ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ వైపు హీరోగా ఈ చిత్రంలో నటిస్తూనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలకమైన పాత్రలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

దర్శకుడు ఏఏంఆర్‌ రమేష్‌ తెరకెక్కించనున్న తాజా చిత్రంలో రానా సీబీఐ ఆఫీసర్‌గా నటించనున్నాడు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో కీలక పాత్ర పోషించిన సీబీఐ ఆఫీసర్‌ కార్తికేయన్‌ పాత్రలో రానా పవర్‌ఫుల్‌గా నటించనున్నాడు. సీబీఐ ఆఫీసర్‌ పాత్రకు రానా బాడీ సరిగ్గా సరిపోవడంతో పాటు ‘బాహుబలి’ చిత్రంతో కూడా దేశ వ్యాప్తంగా మెప్పించాడు. అందుకే దర్శకుడు రానాను ఈ పాత్ర కోసం ఎంపిక చేశాడు.