నాపై కుట్ర జరుగుతోంది….బొత్స

డిల్లీ స్థాయిలో తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందులో భాగంగానే జాతీయ మీడియాలో  తనపై పలు ఆరోపణలతో కూడిన కధనాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ” నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు. వారెవరో  చెప్పలేను. గతంలోనూ నాకు లిక్కర్ మాఫియాతో సంబంధాలున్నాయంటూ కథనాలు వచ్చాయి. మంత్రి కిషోర్ చంద్రదేవ్ నాపై  సోనియా గాంధీ కి   లేఖ రాసినట్లు తెలియదు. ఆయనలా రాసివుంటాడని నేను అనుకోవటం లేదు. నన్ను మాఫియా డాన్ గా అభివర్ణిస్తూ కథనాలు ప్రచురించిన  హిందూస్తాన్ టైమ్స్ పత్రికపై పరువునష్టం దావా వేస్తాను. ” అని బొత్స అన్నారు. ఈ ఉదంతంపై కిశోర్ చంద్రదేవ్ తో తాను మాట్లాదేదేమి లేదని , అధిష్టానం కూడా దీనిని గురించి తనను ఇంతవరకు వివరణ ఏదీ కోరలేదని ఆయన తెలిపారు. తన కుమార్తె పెళ్లిని కూడా రాజకీయం చేస్తూ కొన్ని  జాతీయ పత్రికలు కథనాలు రాస్తున్నాయని, ఇది చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరో పనిగట్టుకుని తనను అప్రతిష్ట పాలు  చేసేందుకు కుట్రలు చేస్తున్నారని బొత్స అనుమానం వెలిబుచ్చారు. పి.సి.సి. అధ్యక్ష పదవి నుంచి తనను పీకి  వేస్తారంటూ కూడా ఊహాగానాలు  వస్తున్నాయి.”  సోనియాగాంధీ పిలిచి ఈ బాధ్యత కట్టబెట్టారు. ఆవిడ వుండమంటే వుంటాను వెల్లిపొమ్మంటే వెళ్ళిపోతాను ” అని బొత్స అన్నారు.