మంత్రిగా పవర్‌ చూపుతున్న లోకేష్‌.. ప్రశంసల జల్లు

ఇటీవలే ఏపీ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు చూసుకునే సమయంలోనే పార్టీ కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చిన సాయం చేసిన లోకేష్‌ ఇప్పుడు మంత్రిగా తన పవర్‌ను ఉపయోగించి సామాన్య ప్రజల కష్టాలను తీర్చడంలో ముందుంటున్నాడు. ఇతర మంత్రులతో పోల్చితే సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటూ సమస్యల పరిష్కారంకు కృషి చేస్తున్నాడు. లోకేష్‌ పరిపాలనలో చూపిస్తున్న చొరవ మరియు తెలివి తేటలకు సీనియర్‌ మంత్రులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

లోకేష్‌ మంత్రి అయిన వెంటనే ఏ సమస్యలున్నా కూడా తనను ట్విట్టర్‌ ద్వారా సంప్రదించాల్సిందిగా సూచించాడు. ఆశించినట్లుగానే ఎంతో మంది పలు సమస్యలను లోకేష్‌ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 1005 ఫిర్యాదులను లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా పొందడం జరిగింది. ఇప్పటికే ఆ ఫిర్యాదుల్లో 329 సమస్యలకు పూర్తి పరిష్కారంను లోకేష్‌ సూచించారు.

ఇక శాఖ వారిగా ఫిర్యాదు చూస్తే ఐటి శాఖలో 53, గ్రామీణభివృద్ది శాఖలో 247, పంచాయితీరాజ్‌ శాఖలో 165, ఇతర శాఖలకు సంబంధించి 540 ఫిర్యాదులు లోకేష్‌ వద్దకు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ద చూపించాలంటూ ఆయా శాఖలకు బదిలి చేయడం జరిగింది. ఇలా సోషల్‌ మీడియా ద్వారా అందుతున్న సమస్యలపై వెంట వెంటనే చర్యలు తీసుకుంటూ, వాటికి పరిష్కారం చూపుతుండటంతో పార్టీ నాయకులతో పాటు అంతా కూడా మంత్రి లోకేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.