హిట్‌, ఫట్‌లతో నాకు సంబంధం లేదు

తనకు సరిపోయే పాత్రలను ఎంపిక చేసుకుంటూ, నచ్చిన కథలకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ అందంతో పాటు నటనకు కూడా మంచి మార్కులను కొట్టేసిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు నటించిన ‘రాధ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చంద్రమోహన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్‌ నటించాడు. ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా లావణ్య తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ చిత్రంలో తన పాత్ర మోడ్రన్‌ కాలేజీ అమ్మాయిగా ఉంటుందని, దర్శకుడు తన పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడని చెబుతోంది.

కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని, కచ్చితంగా ‘రాధ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని లావణ్య చెబుతోంది. ఏ చిత్రానికైనా కూడా సమానంగా కష్టపడుతామని, హిట్‌, ఫట్‌ మన చేతిలో ఉండదు కాబట్టి వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాంటివి పట్టించుకోను అని చెబుతోంది. ఈ చిత్రం తర్వాత చైతూతో రొమాన్స్‌ చేయనున్నానని లావణ్య చెప్పుకొచ్చింది.