చంద్రబాబుకు బాసటగా భార్య, కుమారుడు

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ప్రత్యక్ష్యంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తనవంతుగా ఇప్పుడు, భవిషత్తులో కృషి చేయడానికి తలపెట్టిన “వస్తున్నా… మీకోసం” పాదయాత్రలో చంద్రబాబుకు బహిరంగంగా బాసటగా నిలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం సమాయత్త మయ్యారు. చంద్రబాబు పాదయాత్రలో పాల్గొనాలని ఆయన భార్య భువనేశ్వరీ, కుమారుడు లోకేష్ లు నిర్ణయించడం తెలుగుదేశం కేడరులో ఉత్సాహాన్నినింపుతోంది. ఇన్నాళ్ళూ చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడూ ఆరా తీస్తూ, ఏ మాత్రం సమస్య తలెత్తినా ఆగమేఘాల మీద ఆయన ఉన్న చోటకు వచ్చి సపర్యలకు పూనుకుంటున్నారు. ఆదివారం చంద్రబాబుతో కలసి అడుగులో అడుగు వేయడానికి ప్రజలకు చేరువ కావడానికి ఆయన భువనేశ్వరీ, లోకేష్ లు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో శంకర్ పల్లి లో శనివారం రాత్రి  విడిది చేసిన  చంద్రబాబు ఆదివారం మొదలు పెట్టిన పాదయాత్రలో వారు పాల్గొన్నారు. ఈ రోజు రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆయన మెదక్ జిల్లాలో ప్రవేశిస్తారు. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకూ అభిమానిగా ఉన్న భువనేశ్వరి ఇక ప్రత్యక్ష స్థాయిలో పార్టీకి అండగా నిలవనున్నట్లు విశదమవుతోంది. చంద్రబాబు ఆరోగ్యాన్ని చెంతనే ఉండి పరిశీలించడానికి ఎటువంటి ఇబ్బందులు  తలెత్తినా  చూసుకోడానికి వీలవుతుందని కూడా ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాదయాత్ర ప్రారంభంలో హిందూపూర్‌ లో కుమారుడితో కలసి వచ్చి చంద్రబాబుతో పూజాధికాలు నిర్వహింఛి యాత్ర విజయవంతం కావాలని కాంక్షించారు. గత దసరాకు ముందు మహబూబ్ నగర్ జిల్లాలో స్టేజీ కూలడంతో గాయపడ్డారని తెలిసి తక్షణం అక్కడకు వచ్చి చంద్రబాబుకు తోడుగా నిలబడ్డారు. అదే సందర్భంలో దసరా ఉత్సవాల్లో మహిళలతో కలసి బతకమ్మ పూజలో పాల్గొన్నారు. బతకమ్మ పాటల్లో మహిళలతో కలసి అడుగులో అడుగు వేశారు. ఇప్పటికే కుమారుడు లోకేష్ మధ్యమధ్యలో తండ్రితోపాటు పాదయాత్రలో కలసి అడుగులు వేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక భువనేశ్వరి హైదరాబాదులో ఉన్నా చంద్రబాబు పాదయాత్ర విశేషాలు తెలుసుకుంటూ భర్త ఆరోగ్యంగా పాదయాత్రను నిరాటంకంగా కొనసాగాలని కాంక్షించడం, పరోక్షంగా ప్రజలకు అండగా నిలబడటం, వారి సమస్యలు పరిష్కారం కావాలన్న తపనను వెల్లడించారు.ఇప్పుడు ఏకంగా భర్తతో పాదయాత్రలో పాలుపంచుకోవాలని ముందుకు రావడం తెలుగు మహిళలు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేకేత్తిస్తోంది.