‘బాహుబలి 2’ని చూడొద్దంటున్న దర్శకులు

‘బాహుబలి 2’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చరిత్రను సృష్టించే విధంగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం గత రికార్డులన్నీ కూడా బద్దలు కొడుతూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలయిన అన్ని భాషల్లో కూడా ‘బాహుబలి 2’ చిత్రం కలెక్షన్ల వరద పారిస్తోంది. మొదటగా ఈ చిత్రాన్ని కన్నడలో విడుదల కానివ్వబోం అంటూ కన్నడ సంఘాలు ‘బాహుబలి 2’ టీం హెచ్చరించాయి. కానీ దర్శకుడు రాజమౌళి, సత్యరాజ్‌లు స్పందించి కన్నడ సంఘాలను శాంతింప జేసి ఎట్టకేలకు కన్నడలో విడుదల చేశారు. ఇక విడుదలయినప్పటి నుండి ‘బాహుబలి 2’ బాదుడు మొదలయింది.

‘బాహుబలి 2’ చిత్రంతో కన్నడ స్టార్‌ హీరోల చిత్రాలు సైతం మూగబోయాయి. ఇతర చిత్రాలన్నిటికి కూడా గట్టి దెబ్బతగులుతోంది. దాంతో అంతా ఓ నిర్ణయానికి వచ్చి స్టార్‌ డైరెక్టర్‌లు ‘బాహుబలి 2’ చిత్రాన్ని చూడొద్దు అని ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ‘బాహుబలి 2’ చిత్రాన్ని చూడిద్దు అనే హాష్‌ టాగ్‌ పెట్టి ప్రస్తుతం బాగా వైరల్‌ చేస్తున్నారు. కన్నడ స్టార్‌ దర్శకులు చేస్తున్న ఈ పనికి ‘బాహుబలి’ టీం షాకవుతున్నారు. మరీ ఇంత దారుణంగా ఒక చిత్రంపై చెడు ప్రచారం ఎలా చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారు.