” ఏ త్యాగాలు చేసి జగన్ జైలుకు వెళ్ళాడు ? “

రానున్న ఎన్నికలలో అభ్యర్ధులను చాలా ముందుగా ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజల్లో ఉన్నవారినే అభ్యర్ధులుగా ప్రకటిస్తామని, అజాగ్రత్త పనికిరాదని, అందరూ కలిసిగట్టుగా పని చేయాలని ఆయన అన్నారు. శనివారం నాడు చేవెళ్ళ మండలం వీర్లపల్లి లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకులలో సీరియస్ నెస్ కనిపించటం లేదని, తానొక్కడినే రోడ్లవెంట తిరుగుతున్నానని ఆవేదనగా అన్నారు. పార్టీ అభ్యర్ధులు అలంకార ప్రాయంగా మారకూడదని ఆయన హెచ్చరించారు. దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా వుందని ప్రకటించారు. ఇంచార్జ్ లుగా నియమించినంత వారే అభ్యర్దులమని అనుకోరాదని, సరిగా పనిచేయకపోతే వేరే అభ్యర్ధులను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేసారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు జైళ్ళ నుంచే రాజకీయాలు నడుపుతున్నారని ఆయన అన్నారు. ఏ త్యాగాలు చేసి జగన్  జైలుకు వెళ్ళారో ఆ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పాలని, తన అక్రమ సంపాదనకు లెక్కలు చూపలేకనే జగన్ జైలుకు వెళ్ళారని చంద్రబాబు అన్నారు.