భాజపా అగ్రనేతలకు ప్రధాని విందు

కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం నేతలకు అధికార పక్షాన యూపీ ఏ విందు ఏర్పాటు చేసింది. మీరు చదివింది నిజమే… భాజపా అగ్రనేతలను ప్రధాని మన్ మోహన్ విందుకు ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దేశీయ చిల్లర వర్తకంలోకి అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి మద్దతును కూడగట్టే పనిలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రధాని విందు రాజకీయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే! ముందు యూపీ ఏ మిత్రపక్షాలపై చూపు సారించిన ప్రధాని ఇప్పుడు తాజాగా ప్రతిపక్షాలను కూడా ఆకర్షించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే శనివారం ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ నేతలతో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విందు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇదేవిషయంపై ఆయన యూపీఏ కూటమి భాగస్వామ్యపక్షాలకు శుక్రవారం విందు ఏర్పాటు చేసి ఎఫ్డీఐ అంశంపై చర్చించినపుడు మిత్రపక్షాల నుంచి సానుకూల వైఖరి వచ్చినట్టు సమాచారం. ఇదే అంశంపై ఇప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షమైన బీజేని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఎఫ్డీఐల అంశం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభను కుదిపేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతో చర్చలు జరిపి మద్దతు కూడగట్టే ఎత్తుగడల్లో భాగంగా ప్రధాని బీజేపీ లోక్సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీలను విందుకు ఆహ్వానించినట్లు సమాచారం. మరి ఈ విందు రాజకీయాలు ఎలాంటి ఫలితాలనిస్తాయో వేచి చూడాలి. ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చే విందుకు బీజేపీ నేతలు రెఢీగా ఉన్నారు. ప్రధాని విందుకు తమ పార్టీ అగ్రనేతలు వెళతారని బీజేపీ ప్రకటించింది. మన్మోహన్ ప్రధాని కాబట్టి, ఆయన ఇచ్చే విందు ఆహ్వానాన్ని అంగీకరించినట్టు బీజేపీ నేతలు తెలిపారు.