భాగ్యనగర్‌ దళపతిగా తలసాని

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ తెదేపా అధ్యక్షుడిగా మాజీ  మేయర్‌ తీగల కృష్ణా రెడ్డీ స్థానంలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారు. నగరంలో పార్టీ పూర్వ వైభవం కోసం తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానని, నగర పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకు వస్తానని, తనను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమించడం పట్ల తలసాని పార్టీ అధ్యక్షుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలోకి తొంగిచూస్తే ముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి దూరం జరిగి ఆ తర్వాత క్రమంగా దగ్గరయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం తెదేపా తరపున రాజ్యసభ స్థానాన్ని ఆశించి తీవ్రంగా భంగపడ్డారు తలసాని. దీనికి తోడయినట్టు పార్టీలో తన వ్యతిరేక వర్గం అయిన దేవేందర్ గౌడ్‌కు రాజ్యసభ స్థానం దక్కడంతో తలసాని తీవ్రగా ఆగ్రహించారు. తెదేపా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటిస్తూ దేవేందర్ గౌడ్‌కు రాజ్యసభ స్థానం ఖాయం చేసిన పార్టీ సమావేశంలోనే ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సమావేశం నుండి వాకౌట్‌ చేసి ఉన్నారు . తలసాని అధినేత వైఖరిని ప్రశ్నిస్తూ పార్టీలో నుండి వెళ్లిపోయి మళ్లీ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. పలు సందర్భాలలో టిడిపిలో ఉన్నారా అని ప్రశ్నిస్తే ఆయన నుండి సమాధానం కూడా రాలేదు. పార్టీలో లేనని ఎప్పుడూ చెప్పక పోయినప్పటికీ దూరమయ్యేందుకు దాదాపు సిద్ధమయ్యారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా ఓదశలో జోరుగా సాగింది. అయితే ఆ తర్వాత అసంతృప్తి గా ఉన్న తలసాని గ్రేటర్ అధ్యక్ష పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినందు వల్లే వెనక్కి తగ్గారని సమాచారం. హామీ ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు ఆయనకు గ్రేటర్ పీఠం కట్టబెట్టారని అంటున్నారు.