రిలయన్స్ జియో వినియోగదారులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ వస్తుంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదు అన్నట్లుగా ఉంది జియో వినియోగదారుల పరిస్థితి. జియో ఇప్పటికే 9 నెలల అపరిమిత డేటా మరియు కాల్స్‌ను ఉచితంగా అందించింది. ఇక సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అంటూ మరో కొత్త ఆఫర్‌ను అతి తక్కువ ధరకే ఇచ్చేందుకు జియో సిద్దం అయ్యింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని 303 రూపాయలతో రీచార్జ్ చేస్తే సమ్మర్ ఆఫర్ కింద మూడు నెలల పాటు జియో సేవలు పొందవచ్చు.
ఇప్పటికే చాలా మంది జియో వినియోగదారులు ఈ ఆఫర్‌ను ఎంచుకున్నారు. మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో మరింత మంది ఈ ఆఫర్ కోసం రీచార్జ్ చేసుకుంటారని భావిస్తున్న సమయంలో ట్రాయ్ నుండి జియోకు షాక్ తలిగింది. నిబంధనలకు విరుద్దంగా సమ్మర్ ఆఫర్ ఉందని వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా జియోను ట్రాయ్ ఆదేశించింది. దాంతో ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా సమ్మర్ ఆఫర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లుగా జియో ప్రకటించింది. జియో ప్రకటనతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. అయితే ఇప్పటికే ఈ ఆఫర్‌ను రీచార్జ్ చేయించుకున్న వారికి సమ్మర్ ఆఫర్ కొనసాగుతుందని జియో ప్రకటనలో వెళ్లడి చేసింది.