టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ సినిమా రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఎక్కడో ఒక చోట కొత్త రికార్డులు నమోదు చేస్తూనే బాహుబలి దూసుకు పోతున్నాడు. ఇక బాహుబలి రెండవ పార్ట్ ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. బాహుబలిపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ అద్బుతమైన ప్లాన్ చేశాడు.
‘బాహుబలి’ సినిమా మొదటి పార్ట్ బాలీవుడ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏ సౌత్ సినిమా కూడా సాధించని కలెక్షన్స్‌ను బాహుబలి చిత్రం బాలీవుడ్లో సాధించింది. ఇక ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేసి డబ్బులు సంపాదించాలని, రెండవ పార్ట్ రాబోతున్న నేపథ్యంలో మొదటి పార్ట్‌పై కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని కరణ్ జోహార్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అందుకే నేడు(ఏప్రిల్ 7) దేశ వ్యాప్తంగా హిందీ వర్షన్లో దాదాపు వెయ్యి థియేటర్లలో ‘బాహుబలి’ని రీ రిలీజ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. రీ రిలీజ్లో బాహుబలి ఎంత వసూళ్లు చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.