సంచలనం రేపిన అయేషా మీర హత్యకేసులో 9 సంవత్సరాల క్రితం అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపిన సత్యంబాబును తాజాగా కోర్టు నిర్ధోషి అని తేల్చి, ఆయన్ను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద మనుషులను తప్పించడం కోసం సత్యం బాబు వంటి అమాయకుడిని కేసులో ఇరికించారు అనే అరోపణలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో అప్పుడు కేసును విచారించిన ఆఫీసర్ రంగనాధ్ మీడియా ముందుకు వచ్చారు. కోర్టు తీర్పు సత్యంబాబుకు అనుకూలంగా వచ్చినా ఆయన దోషే అంటూ రంగనాథ్ చెప్పుకొచ్చాడు. ఘటన స్థలంలో లభించిన డీఎన్ఏ రిపోర్ట్ సత్యం బాబు డీఎన్ఏ రిపోర్ట్‌తో సరిపోయింది. ప్రపంచంలో ఏ ఇద్దరి డీఎన్ఏ రిపోర్ట్ ఒకే విధంగా ఉండవు. అంటే ఆ ప్రదేశంలో లభించిన డీఎన్ఏ శాంపిల్స్ సత్యంబాబుకు సంబంధించిందే. అలాగే హాస్టల్లోని విద్యార్థినిలు కూడా సత్యంబాబును గుర్తించారు. ఇలాంటి సమయంలో ఎలా సత్యంబాబు నిర్దోషి అవుతాడు అంటూ రంగనాథ్ ప్రశ్నించాడు. కోర్టు తీర్పుపై అపీల్‌కు వెళ్లబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. కోర్టులో సత్యంబాబును దోషిగా నిరూపిస్తామని ఆయన చెప్పుకొచ్చాడు.