దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యం కారణంగా జనవరి 29న హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన విషయం తెల్సిందే. దాసరి ఆరోగ్యంపై తీవ్ర స్థాయిలో సినీ పరిశ్రమలో మరియు రాజకీయ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దాసరి ఆరోగ్యం గురించి పలు రకాల వార్తలు మీడియాలో వచ్చాయి. ఒక తెలుగు న్యూస్ ఛానెల్ ఏకంగా ఆయన చనిపోయాడు అంటూ స్క్రోలింగ్‌ను కూడా రన్ చేసింది. అయితే కిమ్స్ వైధ్యులు మరియు మోహన్‌బాబు ఆ వార్తలను కొట్టి పారేసిన విషయం తెల్సిందే. దాసరి ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా బాగయ్యింది. దాదాపు రెండు నెలల పాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న అనంతరం నేడు దాసరి డిశ్చార్జ్ అయ్యారు.
దాసరి అనారోగ్యం విషయం తెలిసి సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా ఆయనను హాస్పిటల్‌లో పరామర్శించిన విషయం తెల్సిందే. దాసరి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన డిశ్చార్జ్ సందర్బంగా దాసరి ఇంటి ముందు భారీగా జనాలు పోగయ్యారు. దాసరి ఆరోగ్యంగా ఇంటికి చేరడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక దాసరి హాస్పిటల్ బిల్లు గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. కిమ్స్ వైధ్యులు దాసరి చికిత్స బిల్లు దాదాపు కోటి వరకు వేసినట్లుగా తెలుస్తోంది. దాసరి కేంద్ర మాజీ మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు.