ఆడియో రివ్యూ : ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’

baahubali 2 audio review

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు ? ఈ ప్రశ్నకి సమాధానం కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రశ్న పెంచిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా చివర్లో ఒక మంచి మలుపులా ఉంటుందనుకొన్నాను తప్ప, ఆ ప్రశ్న ఇంతగా ఆసక్తిని రేకెత్తిస్తుందని రాజమౌళి కూడా ఉహించివుండరు. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ దాన్ని చూపించబోతున్నారు. అంతేకాదు.. బాహుబలి విజువల్ వండర్స్ ఎలా వుండబోతున్నాయి ? బాహుబ‌లి 2 ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది ? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమా పై అంచనాలను మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇప్పుడీ సినిమా ఆడియో బయటికివచ్చింది. బాహుబలి పార్ట్ వన్ ఆడియో సూపర్ హిట్. అద్భతమైన బాణీలు అందించారు కీరవాణి. ఇప్పటికీ ధీవరా, పచ్చబొట్టేసినా, బాహుబలి థీమ్.. నాలుకపై ఆడుతూనే వున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ పాటలు బయటికివచ్చాయి. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. మరి ఈ పాటలు ఎలా సాయిగా ? శ్రోతలను ఎలా ఆకట్టుకున్నాయి? తెలుసుకోవాలంటే ఆడియో రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

1. సాహోరే బాహుబలి
గాయనీ గాయకులు : దలేర్ ర్ మెహింది, కీరవాణి, మౌనిమ
రచన : కె.శివ శక్తి దత్త
‘భళి భళి భళి రా భళి.. సాహోరే బాహుబలి’ అంటూ సాగిన ఈ పాట ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ థీమ్ ప్రతిభింబిచింది. పాట మొదలవ్వడమే బాహుబలి స్థాయిలో హెవీ రిధమ్ తో సాగింది. దలేర్ మెహింది వాయిస్ ఈ పాటకు మరో పెద్ద ఎసెట్. ఈ పాటలో రెండు వైవిధ్యాలను చూపించారు. దలెర్ వాయిస్ లో బాహుబలి లక్ష్యాలను, ధైర్య సాహసాలను కీర్తిస్తే.. కీరావాణి స్వరంలో శివగామి వాత్సల్యాన్ని , భావాల్ని పలికించారు. సాహిత్యం కూడా అద్భుతంగా కుదిరింది. మధ్య మధ్యలో వినిపించిన సంస్కృత పదాలు బాహుబలి స్థాయిలో వున్నాయి. ఇక పాట చివర్లో మళ్ళీ బాహుబలి థీం ను యాడ్ చేయడంతో పాట మరో స్థాయికి వెళ్ళింది.

2. హంస నావ

గాయనీ గాయకులు : సోని, దీపు
రచన : చైతన్య ప్రసాద్
‘ఓరోరి రాజా.. వీరాధి వీర..’ ఈ పాట ఓ యుగళగీతం. అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ పాట. బాహుబలి పార్ట్ వన్ లో శివుడు, అవంతిక ల ‘పచ్చబొట్టేసినా ‘ అనే అద్భుతమైన యుగళ గీతాన్ని చిత్రీకరించారు రాజమౌళి. ఇప్పుడు పార్ట్ 2లో బాహుబలి, దేవసేనల వంతు వచ్చింది. ఓరోరి రాజా.. వీరాధి వీర అంటూ దేవసేన, అమరేంద్ర బాహుబలి పై తనకున్న ఇష్టాన్ని ప్రేమను చూపించే గీతమిది. కీరవాణి అంటే మెలోడి. ఈ పాట కూడా అద్భుమైన మెలోడిని తలపించింది. కీరవాణి వైలన్ ను వాడటంలో దిట్ట. ఈ పాటలో కూడా ఓ అద్భుతమైన వైలన్ స్ట్రోక్ వాడారు. అలాగే బాహుబలి స్థాయికి సరిపడే స్త్రింగ్స్ వర్క్ కూడా ఈ పాటలో వినిపిస్తుంది. రాజమౌళి ఈ పాటను మరో రొమాంటిక్ దృశ్యగీతంగా తెరకెక్కించుటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

3: కన్నా నిదురించరా
గాయనీ, గాయకులు : శ్రీనిధి, వి. శ్రీసౌమ్య
రచన : ఎం. ఎం. కీరవాణి
“మురిపాల ముకుందా..’అనే లిరిక్ తో సాగిన ఈ పాట శ్రీకృష్ణుడి లాలిపాటను తలపించింది. ఈ పాటకు సినిమాలో ఎలాంటి ప్రత్యేకత వుందో అప్పడే చెప్పలేం కాని చాలా సాదాసీదాగా సాగింది బాణీ. లాలిపాటకు తగట్టే ఎక్కువ ఇంస్ట్రుమెంట్ లేయర్స్ వినిపించలేదు. చాలా సింపుల్ గా తేల్చేశారీ పాట. అయితే వినడానికి వినసొంపుగా వుంది. రాజమౌళి టేకింగ్ లో ఈ పాటకు మరింత ప్రత్యేకత రావచ్చు.

4 దండాలయ్యా

గాయనీ గాయకులు : కాల భైరవ
రచన : ఎం. ఎం. కీరవాణి
‘పడమర కొండల్లో వాలిన సూరీడా..’ అంటూ కీరవాణి వాయస్ తో ఈ పాట మొదలౌతుంది. బాహుబలి కధలో కీలకమైన పాటది. బాహుబలి రాజ్యం విడిచివెళ్లిపోతున్నప్పుడు ప్రజలు వెల్లకూడదని ఆయన్ని అప్పుతున్న సందర్భం నుండి ఈ పాట పుట్టిందనిపిస్తుంది. బాధను , సంతోషాన్ని ఈ పాటలో వ్యక్తం చేశారు. ఈ పాటలో బాహుబలి థీమ్ వినిపించింది. కీరవాణి చేసిన సింపనీ ఆకట్టుకుంది. ఇదీ బాహుబలి స్థాయి పాటే.

5. ఒక ప్రాణం
గాయకుడు : కాల భైరవ
రచన : ఎం. ఎం. కీరవాణి
‘ఒక ప్రాణం ఒక త్యాగం..’ ఈ పాటలో సాహిత్యం అర్ధం చేసుకుంటే బాహుబలి కధపై ఓ ఐడియా వచ్చేస్తుంది. ఈ పాటలో బాహుబలిలో కీలక పాత్రధారుల గురించి వివరించారు. భల్లాలుడు-బాహుబలి మధ్య వచ్చిన వైరం దేనికోసం, బాహుబలి ఎందుకు బలయ్యాడు, దేవసేన, శివగామిల మమకారం ఏమిటి ? చివరికి రాజ్యం ఎవరికి ? ఇలా అన్నీ కోణాలను స్పృశిస్తూ ఈ పాటను స్వరపరిచారు. ఈ పాటలో బాహుబలి డెప్త్ వినిపించింది. పాట చివరిలో ‘శివం’ అని ముగించడం బావుంది. బాహుబలి కధ మొత్తం ఆ శివుడి లీలగా అభివర్ణించడం ఈ పాట ఉద్దేశం కావచ్చు. ఈ పాట కూడా బాహుబలి మార్క్ లో సాగింది.