మీడియా రంగంలో లెజెండ్ అయిన రామోజీరావును ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రపతిగా చేసేందుకు చర్చలు జరుపుతుందని, రామోజీరావుకు మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఈనాడు అధినేతకు ఆ ఛాన్స్ దక్కబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా పలు మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కాస్త అనుకూలంగా రాస్తూ రామోజీరావు తన పత్రిక స్థాయిని పెంచుకుంటూ వస్తున్నారు. ఇక గత కొంత కాలంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై పలు సందర్బాల్లో ప్రశంసలు కురిపిస్తూ, మోడీ చిన్న పని చేసినా పెద్దగా చూపిస్తూ, మోడీ చిన్న విజయం సాధించిన పెద్దగా కథనాలు రాస్తూ వస్తున్నారు.
మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంను ఈనాడు ఆధ్వర్యంలో భారీగా నిర్వహించారు. ఇక రామోజీరావు అభ్యర్థితత్వం పట్ల అంతా కూడా సానుకూలంగా ఉండేలా ఆయన తరపు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రామోజీరావు అభ్యర్థిత్వంను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాధిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయంలో కేసీఆర్ కూడా మద్దతుగా ఉన్నాడు. అయితే రాష్ట్రపతి పదవికి రామోజీరావు అర్హుడు కాదని కొందరు వాదిస్తున్నారు. మీడియా రంగంలో లెజెండ్ అయినంత మాత్రాన అన్ని రంగాల్లో కూడా ఆయన ఉత్తముడిగా భావించవద్దని, పలు సందర్బాల్లో ప్రజలను రామోజీరావు మోసగించాడని, ఆయనపై ఆరోపణలు ఉన్నాయని కొందరు అంటున్నారు.
ఒక వేళ ఎన్డీయే ప్రభుత్వం రామోజీ రావు పేరును తీసుకు వచ్చినా, ఆయనపై గతంలో ఉన్న ఆరోపణు అన్ని కూడా కొత్త రంగు పులుముకుంటాయని స్వయంగా బీజేపీ నేతలు జాతీయ నాయకులకు చెబుతున్నారు. మోడీ వద్ద పది మంది పేర్లు రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం పరిశీలనలో ఉన్నాయి. ఆ పది పేర్లలో రామోజీ రావు పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతుంది.
రాష్ట్రపతిగా రామోజీకి అవకాశాలు దాదాపు అసాధ్యం అని కొందరు అంటున్నారు. అయితే ఒక తెలుగు వ్యక్తికి అత్యున్నత పదవి దక్కితే మనకు అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి.