తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రేపటి నుండి నామినేషన్లను స్వీకరించబోతున్నట్లుగా ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఇప్పటికే జయలలిత మేనకోడలు దీప జయకుమార్ పోటీ చేసేందుకు సిద్దం అవ్వగా, శశికళ వర్గం నుండి ఒక అభ్యర్థిని దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పన్నీర్ సెల్వం కూడా అమ్మ స్థానంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే బీజేపీ కూడా ఆ స్థానంను దక్కించుకోవాలని పావులు కదుపుతుంది.
అమ్మ మరణించినప్పటి నుండి ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అమ్మ మరణంపై విచారణ జరగాల్సిందే అని, అమ్మ అభిమానిగా కోరుతున్నాను అంటూ మీడియాలో తెగ సందడి చేసిన సినీ నటి గౌతమిని బీజేపీ ఆర్కే నగర్ అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అందుకోసం బీజేపీ అధినాయకత్వం గౌతమితో సంప్రదింపులు జరిపారు. తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో గౌతమి విజయం కాస్త కష్టమే. అయితే ఉత్తరాదిన భారీ విజయాు సొంతం చేసుకున్న బీజేపీ తమిళనాట పాగా వేసేందుకు ఈ ఉప ఎన్నికను కీలకంగా తీసుకుంది.
కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు, ప్రజా బలం ఉందన్న ఉద్దేశ్యంతో గౌతమిని పోటీలో దించితే తప్పకుండా ఫలితం ఉంటుందనే అభిప్రాయంతో ఉంది. ఆర్కే నగర్ ప్రజలు ఎటు మొగ్గు చూపుతారు అనే విషయంలో స్పష్టత లేదు. అందుకే గౌతమికి కూడా అవకాశాలు పూర్తిగా లేవు అని చెప్పేందుకు లేదు. బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా అమ్మ స్థానంను దక్కించుకోవచ్చు. భవిష్యత్తులో కూడా బీజేపీ తమిళనాడులో ప్రాభవం చూపేందుకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి.