మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన ప్రతి సినిమాలో కూడా కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. తాజాగా విడుదలైన ‘ధృవ’ సినిమాలో చరణ్ లుక్కు మంచి స్పందన వచ్చింది. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మంచి మేకోవర్‌తో, బాడీతో చరణ్ కనిపించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం చరణ్ తన తర్వాత సినిమా అయిన సుకుమార్ సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. తన ప్రతి సినిమాలో కూడా హీరోలను కాస్త విభిన్నంగా చూపించాలని సుకుమార్ తాపత్రయ పడుతుంటాడు. అలాగే ఈ చిత్రంలో కూడా చరణ్‌ను కొత్తగా చూపించాలని భావిస్తున్నాడు. ఆ బాధ్యతను చిరంజీవి పెద్ద కూతురు సుష్మితపై సుకుమార్ వేశాడు.
‘ఖైదీ నెం.150’ చిత్రంలో చిరంజీవి లుక్కు మంచి స్పందన వచ్చింది. ఆ చిత్రంలో చిరంజీవి ఏజ్ చాలా తక్కువ చేసి సుష్మిత చూపించింది. సుష్మిత ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ కారణంగానే చిరంజీవి ఏజ్ తగ్గింది. ఆ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన సుష్మిత తాజాగా చరణ్ సినిమాకు ఎంపిక అయ్యింది. చరణ్‌ను సుకుమార్ స్క్రిప్ట్‌కు తగ్గట్లుగా మార్చే పనిలో సుష్మిత ఉన్నట్లుగా తెలుస్తోంది. 1980లలో కథాంశంతో ఒక పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దాంతో చరణ్‌ను ఆ దిశగా సుష్మిత రెడీ చేయనుంది. అయితే చరణ్ ఫ్యాన్స్‌ను తన ప్రతిభతో సుష్మిత మెప్పించగలదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 20న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.