యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు అయిన వివి వినాయక్ తాజాగా ‘ఖైదీ నెం.150’ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెల్సిందే. టాలీవుడ్ నెం.2 స్థానంలో నిలిచిన ‘ఖైదీ నెం.150’ చిత్రానికి దర్శకత్వం వహించిన వినాయక్ ఇప్పటి వరకు తన తర్వాత ప్రాజెక్ట్‌ను ఖరారు చేయలేదు. స్టార్ హీరోలు ఏ ఒక్కరు కూడా వినాయక్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేరంటూ వార్తలు వచ్చాయి. పలువురు స్టార్ హీరోలతో మాట్లాడిన వినాయక్‌కు నిరాశే మిగిలింది. చివరకు వినాయక్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
గతంలో అల్లు అర్జున్, వివి వినాయక్‌ల కాంబినేషన్‌లో ‘భద్రినాధ్’ చిత్రం తెరకెక్కింది. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిర్మాత అల్లు అరవింద్‌కు ఆ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. అప్పటి నుండి కూడా బన్నీకి ఒక మంచి సక్సెస్ ఇవ్వాలని వినాయక్ ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు బన్నీ అందుకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘డీజే’ చిత్రం తుది దశలో ఉంది. ‘డీజే’ పూర్తి అయిన తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.
అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందో లేక వంశీ తర్వాత వినాయక్‌తో సినిమా ఉంటుందో కాని, బన్నీ తాజాగా వినాయక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది. అల్లు అరవింద్ మరోసారి వీరి కాంబో మూవీని నిర్మించబోతున్నాడు. వీరిద్దరి కాంబో మూవీ వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.